Tammareddy Bharadwaja : రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి ఆస్కార్ దక్కనుందో లేదో అనేది మరి కొద్దిగంటలలో తేలనుంది. అయితే అంతకముందు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంతటి బడ్జెట్ నాకిస్తే నేని ఎనిమిది సినిమా తీసి మొహాన కొడతాను అని చెప్పడంతో దీనిపై నాగబాబు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించి కౌంటర్లిచ్చారు. ఈ క్రమంలో వారు చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు.
నేను ఓకార్యక్రమంలో మూడు గంటలు మాట్లాడితే అందులో ఓ క్లిప్ తీసుకొని తనపై విమర్శలు చేస్తున్నారు అంటూ తమ్మారెడ్డి అన్నారు. తాను ఏదో కృష్ణా, రామా అంటూ బతుకుతున్నానని చెప్పిన ఆయన రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడాను.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే బయటివాళ్లు ఎవరో నా మీద కామెంట్స్ చేస్తే పట్టించుకోను. కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లు ఇలా అనడం సరికాదు. లెక్కలు వీడికేం తెలుసంటున్నారు కదా, లెక్కలు తెలియకపోయిన వారి అకౌంట్స్ తెలుసు. అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని ఏమేం అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టారో అన్నీ నాకు తెలుసు.
వీటి గురించి నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకొందరు అమ్మ మొగుడిని అంటున్నారు. అది కొంచెం హర్టింగ్‌గా ఉంది. చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంది. నేను వారిలానే రియాక్ట్ కావచ్చు, కానీ నాకు సంస్కారం అడ్డు వస్తుంది. దానిపై నేను రియాక్ట్ కావాలనుకోవడం లేదు అని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. అయిన తనను తిట్టిన వారికి కాస్త అయిన సిగ్గు అనేది ఉండాలి. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుందంటూ తమ్మారెడ్డి తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు.