Seema Simham Movie : టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు, నటులు ఉన్నా కొందరికి మాత్రమే తమ వాయిస్ ద్వారా గుర్తింపు లభిస్తుంది. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్, కొంగర జగ్గయ్య, రంగనాథ్, మోహన్ బాబు, సాయికుమార్ ఇలా కొందరు మాత్రమే తమ వాయిస్ తో జనాన్ని కట్టిపడేశారు. సాయికుమార్ డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ ఎందరో చప్పట్లు కొడుతున్నారు. కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సాయికుమార్ సీమసింహం సినిమాలో బాలకృష్ణకి దీటైన విలన్ గా నటించాడు. సాయికుమార్ క్రేజ్ కూడా అప్పటికే విపరీతంగా పెరిగిపోవడంతో హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆ పాత్రను డిజైన్ చేశారట.
డైలాగ్ కింగ్ గా ఫ్యాన్స్ మనసులను దోచుకున్న సాయికుమార్ గురించి పరుచూరి పలుకులు కార్యక్రమంలో నటుడు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కీలక అంశాన్ని ప్రస్తావించారు. బాలకృష్ణ కూడా తన పాత్రతో సమానంగా సాయికుమార్ పాత్ర ఉండాలని చెప్పాడని, అయితే సాయికుమార్ కి గల పాజిటివ్ ఇమేజ్ వలన విలన్ గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదని గోపాలకృష్ణ చెప్పారు. అయితే నరసింహనాయుడు కోసం ముందుగా అనుకుని ఆ తరువాత పక్కన పెట్టేసిన సెకండాఫ్ ను ఈ సినిమా కోసం తీసుకోవడం, బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ లోపాలు, విలన్ గా సాయికుమార్ ను తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ సినిమా డిజాస్టర్ కి కారణంగా చెప్పుకొచ్చారు.
నిజానికి సాయికుమార్ కుటుంబంతో మొదటి నుంచి తమకు మంచి అనుబంధం ఉందని ఆ కుటుంబంలోని పిజె శర్మ తో సహా అందరితో కలిసి పనిచేశామని గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యంగా సాయికుమార్ కి కర్తవ్యం, మదరిండియా, సర్పయాగం వంటి సినిమాల్లో తన పాత్రలను ఆయన అద్భుతంగా చేశాడని వివరించారు. మొత్తానికి ఒకవైపు పాజిటివ్ పాత్రలు, మరో వైపు నెగెటివ్ పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. ఆ తరువాత పోలీస్ స్టోరీతో హీరోగా చేసిన సాయికుమార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడలో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.