Ram Gopal Varma : కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ప్రతి విషయంపై తనదైన శైలిలో ఆరోపణలు చేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా తనకు సమయంలో వారిపై విమర్శలు చేయాలని అనుకుంటే వెంటనే తన ట్విట్టర్ ద్వారా దారుణమైన ఆరోపణలు చేస్తుంటాడు. తాజాగా కృష్ణం రాజు మరణం విషయంలో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఇప్పుడు ఈ విషయం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ రెబల్ స్టార్ ఆదివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. కృష్ణం రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఇతర నటీనటులు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. ఇక కృష్ణం రాజు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌజ్‌లో నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీ కృష్ణంరాజుకి సరైన వీడ్కోలు ఇవ్వలేదని, అత్యంత స్వార్ధపూరిత సినిమా పరిశ్రమ ఇదేనంటూ సినీ పెద్దలపై సంచలన కామెంట్స్ చేశారు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు.! సిగ్గు.! కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికి కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.