Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికల సమరభేరి మోగింది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో తలపడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ, తెలుగుదేశం కన్నా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు? అక్కడ పార్టీ పరిస్థితి ఏమిటి? గెలవడానికి ఎటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ, తెలుగుదేశంతో కలిసి కూటమిగా ఏర్పడిన జనసేనాని తాను ప్రత్యక్షంగా పోటీచేసే నియోజకవర్గంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు.
పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారో అప్పటినుంచి సర్వే సంస్థలన్నీ అక్కడ వాలిపోయాయి. ప్రధాన సర్వే సంస్థలతోపాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇక్కడ సర్వేలు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా జగన్ బరిలోకి దించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు 91వేలు ఉన్నాయి. కాపుల ఓట్లలో చీలకద్వారా విజయం సాధించాలనేది వైసీపీ భావనగా ఉంది. అయితే పవన్ ఎప్పుడైతే పిఠాపురం పేరు ప్రకటించారో అప్పటినుంచి వాతావరణం మారిపోయిందని, పిఠాపురం లోని కాపులంతా తమ ఓట్లను చీలనివ్వకుండా పవన్ కల్యాణ్ కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్‌కి అక్కడ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఈ సారి గెలవడం పక్కాగా అనిపిస్తుంది. పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి భగ్గుమంది. రోడ్లపైకి చేరిన కార్యకర్తలు.. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మకు టికెట్ కేటాయించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఏకంగా టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు తలనొప్పులు తప్పవా అనే డౌటనుమానాలు వ్యక్తమయ్యాయి. పిఠాపురంలో వర్మవర్గం రెబల్‌గా మారితే పవన్‌కు ఇబ్బందేనంటూ వార్తలు వచ్చాయి.