Nara Lokesh : యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా యువగళం పాదయాత్ర నెల్లూరు నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు.. నెల్లూరు నగరం జనసంద్రమైంది. యువగళం పాదయాత్రకు భారీగా జనం తరలిరావడంతో ఒక్క కిలోమీటర్ నడిచేందుకు గంటన్నర సమయం పడుతుందట. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. లోకేష్‌కు దారి పొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రకి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో లోకేష్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. సోమవారం ఉదయం అనిల్ గార్డెన్స్‌లో ‘మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలు, యువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా అమ్మని మించిన దైవం లేదని, మహిళలకు అవకాశాలు కల్పిస్తే, ప్రపంచాన్ని జయించగలరని అన్నారు. బాబు సీఎంగా ఉన్నంత కాలం మహిళలు, యువతుల వైపు చూడాలన్నా భయపడేవారని, జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక మహిళ డాక్టర్ తనకు టీడీపీలో చేరి సేవ చేయాలని ఉందని, మీరు నన్ను మీ పార్టీలోకి తీసుకుంటారా అని అడిగింది. దీనికి స్పందించిన లోకేష్.. యువత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మీరు ఒక ప్రొఫెషనల్‌లో ఉన్నవాళ్లు. సేవ చేస్తామంటే తప్పక తీసుకుంటాం. మీటింగ్ అయ్యాక మీ డీటైల్స్ తీసుకుంటాను. మీలాంటి యంగ్ స్టర్స్ ఇలాంటి సోషల్ ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ కావాలని లోకేష్ తెలియజేశారు. అంగన్ వాడీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనే బాధ్యత పెంపొందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.