టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలు తమ సత్తా చాటుతూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ పేరు ప్రఖ్యాతలు ఎల్లలు దాటే చేస్తున్నారు.అయితే నందమూరి హీరోలు ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించగా, కేవలం నందమూరి హీరోలు మాత్రమే సాధించిన ఓ రికార్డ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దాయన సీనియర్ ఎన్టీఆర్ గతంలో ‘దాన వీర శూరకర్ణ’లో మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మరిన్ని చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య, తారక్, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వేర్వేరు చిత్రాల్లో మూడు పాత్రలు పోషించి ఏకైక ప్రపంచ రికార్డును నందమూరి హీరోలు సొంతం చేసుకోవడం గమనార్హం.
నందమూరి నటసింహం బాలయ్య ‘అధినాయకుడు’ చిత్రంలో మూడు పాత్రలు పోషించారు.. పరుచూరి మురళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాత, తండ్రి, మనవడిగా త్రిపాత్రినభియం చేసి ఆకట్టుకున్నారు. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా.. బాలయ్య నటకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా త్రిపాత్రాభినయంతో తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. 2017లో బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ‘జై లవ కుశ’లో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటించి అలరించాడు. జై, లవ, కుశగా వేర్వేరు బాడీ లాంగ్వేజేతో అదరగొట్టారు.
ఇక మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు త్రిపాత్రాభినయంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘అమిగోస్’ అనే చిత్రంలో సిద్ధార్థ్, మంజునాథ్, మైఖేల్ పాత్రల్లో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా, రీసెంట్‌గా విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు త్రిపాత్రినభినయంతో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విషయమే మరి. అయితే ఇలాంటి రికార్డు కేవలం నందమూరి హీరోలకే సొంతం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.