KTR : ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే సభలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసింది. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలపై కేటీఆర్ సహా పలువురు మంత్రులు సభలో మాట్లాడారు. సభలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో పటిష్ఠమైన శాంతి భద్రతల సుస్థిర వ్యవస్థ ఉందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని ఆయన అన్నారు.. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణలో ఉన్న సుస్థిర శాంతిభద్రతల వ్యవస్థను ప్రశంసిస్తోన్నాయని అన్నారు. ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం లా అండ్ ఆర్డర్ గురించి పట్టింపుల్లేవని, ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ… దిశ సంఘటన చోటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి జగన్.. ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిండు సభలో జగన్ సెల్యూట్ చేశారని అన్నారు.
ఇక్కడి శాంతిభద్రతల వ్యవస్థ గురించి మాత్రం భట్టి విక్రమార్క, రఘునందన్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాత్రం అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంటే.. వారికి ఏ మాత్రం పట్టింపు లేదని, ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనచ్చునని అన్నారు. ఈ మాట వాస్తవం కాదా.. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పలేదా అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.