Kantara Question : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం కాంతార. ఈ సినిమా చిన్నమూవీగా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 18కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.450కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ, ఫిల్మ్ మేకర్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అనేక పురస్కారాలను అందుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమని మరో మెట్టు ఎక్కించింది. అయితే కాంతార మూవీ తాజాగా మరో రికార్డ్ సృష్టించింది . కన్నడ ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఓ ప్రశ్న కాంతార చిత్రం నుంచి వచ్చింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపర్‌లో ఈ సినిమా నుంచి ప్రశ్న వచ్చింది.
అదేంటంటే.. ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారంగా తెరకెక్కింది అని ప్రశ్నించారు. దీనికి నాలుగు ఆప్షన్లుగా జల్లికట్టు, భూత కోలా, యక్షగాన, దమ్మమి అనే ఆప్షన్లు ఇచ్చారు. క్వచ్ఛన్ పేపర్‌లోని ఈ ప్రశ్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన హీరోయిన్ సప్తమి గౌడ ఈ పేపర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వచ్ఛన్ పేపర్ అని పేర్కొంది.దీంతో ఆ క్లిప్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు కన్నడ అభిమానులు కూడా ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక `కాంతార` విషయానికి వస్తే.. బలమైన కంటెంట్ ఉంటే భాషకు అతీతంగా సినిమాని ఆదరిస్తారని ఈ సినిమా ఎంతగానో నిరూపించింది. ఇందులో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతోపాటు సినిమాకి దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, `కేజీఎఫ్`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించడం విశేషం. కన్నడ సాంప్రదాయ పండగ భూత కోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది. అంతేకాక మ్యూజిక్ కూడా సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది.ఈ చిత్రం భారీ కలెక్షన్లతోపాటు ఐఎండీబీ టాప్ 10 అవార్డుని కూడా అందుకుంది. కాంతార చిత్రం ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టించింది. బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.