Jabardasth Ganapathi : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి మనందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్ తెలుగు వాళ్లకి చాలా దగ్గరయ్యారు. అంతేకాదు మోస్ట్ పాపులర్ కూడా అయ్యారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో దూసుకుపోతున్నారు. అయితే కమెడీయన్ గణపతి మాత్రం గవర్నమెంట్ టీచర్‌గా బాధ్యతలని అందుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్ గణపతి… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందినవాడు కాగా, ఇప్పుడు ఆయనకి అదే మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా బాధ్యతలు తీసుకున్నారట.
1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ కేటాయించింది. అందులో జబర్దస్త్ గణపతి కూడా ఉన్నారట. గణపతిని టీచర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఆయన స్కూల్ లో జాయిన్ అయి విద్యార్ధులకి పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తాను జబర్దస్త్ షోను మానేస్తున్నట్లుగా తెలిపాడు గణపతి. టీవీ, సినీ రంగంలో గుర్తింపు వచ్చిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వాటిని వదులుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బ్రహ్మానందం, ఎమ్మెస్ నారయణ వంటి వారు సినీ రంగంలో స్థిరపడేందుకు వారి టీచర్ వృత్తిని వదులుకున్న విషయం తెలిసిందే. టీచర్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్న గణపతి తన భావాలను పంచుకున్నాడు. “నా పాతికేళ్ల కల నెరవేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్న నా కల నేటికి నెరవేరింది. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని గణపతి తెలిపాడు. అయితే జబర్దస్త్ కు రాకముందు కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారట గణపతి. ఆ తర్వాతే హైదరాబాద్ కు వచ్చి కమెడియన్‌గా స్థిరపడ్డారట. మొత్తానికి కామెడీ పంచులు, ప్రాసలతో నవ్వించిన గణపతి ఇప్పుడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేందుకు రెడీ కావడంతో ఆయనకు అందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.