IPL 2023 : క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది కామనే. ఒకప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ బాగానే చేసేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడం లేదు. కానీ తాజాగా జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ చూస్తే మాత్రం కచ్చితంగా సగటు ప్రేక్షకుడికి ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందనే అనుమానం కలుగుతుంది. శనివారం లక్నో వేదికగా లక్నో సూపర్ జియాంట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2023 టోర్నీ 30వ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. అయితే లక్నో జోరు చూసి అందరూ ఆ జట్టే గెలుస్తుందనుకున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆట తీరుతో దూసుకెళ్తూ చక్కని రన్‌రేట్‌ను సైతం మెయింటెయిన్ చేశారు.
కానీ ఏం జరిగిందో తెలియదు. అనూహ్యంగా వికెట్లు వరుసగా పడ్డాయి. దీంతో మ్యాచ్ లక్నో చేజారింది. అయితే అదేమీ భారీ స్కోరు కాదు. తక్కువ స్కోరే. పైగా లక్నోకు వికెట్లు కూడా ఉన్నాయి. కానీ వరుస బంతుల్లో వికెట్లను కోల్పోవడం.. చివరి 5 ఓవర్లలో ఓవర్‌కు 3, 4 పరుగులు అలా చేయడంతో.. అందరికీ డౌట్ వస్తోంది. లక్నో ప్లేయర్లు కావాలనే మ్యాచ్ ఓడిపోయారని.. అసలు ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. అందుకనే లక్నో ఓడిపోయిందని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సైతం ఫిక్సింగ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. అయితే లక్నో ఈ లక్ష్యాన్ని ఛేదించలేక తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. ఒక దశలో 36 బంతుల్లో 31 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉంది. వికెట్లు కూడా చేతిలో ఉన్నాయి. కేఎల్ రాహుల్ క్రీజులోనే ఉన్నాడు. ఓపిగ్గా ఆడితే తప్పక గెలుస్తారు. గెలిచే అవకాశం లక్నోకే ఉంది. కానీ అనూహ్యంగా లక్నో ప్లేయర్లు వికెట్లను కోల్పోయారు. పరుగులు కూడా చేయలేదు. ఇక్కడే ప్రేక్షకులకు అనుమానం వస్తోంది. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని.. కేఎల్ రాహుల్, లక్నో టీమ్ అమ్ముడుపోయారని అంటున్నారు. ఇలాంటి స్క్రిప్టెడ్ మ్యాచ్‌లను చూడడం అవసరమా.. అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.