ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వలన ఆ పిక్స్ తెగ వైరల్‌గా కూడా మారుతున్నాయి. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అందులో ఉన్న వ్యక్తిని కొందరు ఇట్టే గుర్తు పట్టేస్తే మరి కొందరు మాత్రం ఎవరా అని ఆలోచిస్తున్నారు. అతను ఎవరో కాదు దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించిన సత్యమూర్తి… బీ.ఈడీ పూర్తి చేసి అనంతరం కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు.
సాహిత్యం మీద ఉన్న అభిరుచి కారణంగా చైతన్యం అనే నవల రాయడంతో ప్రారంభించారు. పవిత్రులు, పునరంకితం, దిగంబర అంబరం వంటి నవలలు సాహిత్య ప్రియులకు ఎంతగానో వినోదాన్ని పంచాయి. మానవ సంబంధాల మధ్య తలెత్తే సంఘర్షణను ఆధారం చేసుకుని ఆయన రాసిన కథలకు, నవలలకు కథా రచయితగా, నవలా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. డైలాగ్ రైటర్ గా పలు సినిమాలకు పని చేశారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన దేవత సినిమాతో కథా రచయితగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి హీరోలతో పని చేశారు.
బావా మరదళ్ళు, కిరాయి కోటిగాడు, ఖైదీ నంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్, బంగారు బుల్లోడు, భలే దొంగ, అమ్మ దొంగ, చంటి, పెదరాయుడు, మాతృదేవోభవ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. రచయితగా దాదాపు 90 సినిమాలకు పని చేసిన ఆయన.. దాదాపు 400 సినిమాలకు మాటల రచయితగా పని చేశారు. ఈయన తన కెరీర్ లో ఎక్కువగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. ఈయన 2015 డిసెంబర్ 14న చెన్నైలో మరణించగా, ఆయన మరణంతో దేవి శ్రీ ప్రసాద్ ఎంతో కుమిలిపోయారు. ప్రతి సందర్భంలోను తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటారు.