Ghajini : హీరో సూర్య గజిని సినిమాకు ముందు ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ వాటిలో ఏమాత్రం పేరు సంపాదించుకోలేదు. గజిని సినిమాతో ఆయన స్టార్‌డమ్ ఎక్కడికో ఎదిగిపోయింది. అలా ఈ సినిమా ఆయనకు ఎంతో క్రేజ్ సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. ఇలాంటి గజినీ సినిమాని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తిరుగులేని విధంగా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు. మరి అలాంటి గజిని సినిమా కథ వెనుక అనేక ట్విస్టులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక ఇంగ్లీష్ సినిమా మూలంతో ఈ కథ రాశారు మురుగదాస్. ఈ కథ తీసుకొని ఆయన 2003 నుంచి తిరగటం ప్రారంభించారు. ముందుగా తనకు చాలా పరిచయం ఉన్న తెలుగు నిర్మాతల వద్దకు వెళ్ళాడు. ముఖ్యంగా ఆయన సురేష్ బాబు ను కలిసి కథ వినిపించారు.
ఇలాంటి రిస్క్ కథ ఎవరు చేస్తారని సురేష్ బాబు అడగగా మహేష్ బాబు అనుకుంటున్నానని చెప్పారట. మహేష్ బాబు ఉంటే మా బ్యానర్‌లో సినిమా తీయడానికి రెడీ అన్నారట సురేష్ బాబు. కానీ మహేష్ బాబుకు కథ చెప్పగానే బాగానే ఉంది అన్నాడు కానీ తనకు సరిపోదని రిజెక్ట్ చేశారు. తర్వాత విక్టరీ వెంకటేష్ తో చేద్దామనుకున్నారు. ఆయన కూడా ఒప్పుకోలేదు. హీరో గుండు చేయించుకోవాలి, డ్రాయర్ పై కనిపించాలి. ఒళ్లంతా పచ్చబొట్లు వేయించు కోవాలి. అలా అని చాలామంది రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్నాడు. ఆయన కూడా ఆసక్తి చూపలేదు. ఇక తెలుగులో వర్కౌట్ కాక తమిళ హీరోల వెంట పడ్డాడు మురుగదాస్. దీనికి కమల్ హాసన్ కూడా నో చెప్పారు. విజయ్ కూడా వద్దన్నారు.
తమిళంలో కూడా నలుగురు నుంచి ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేశారు. ఇక ఈ కథ విని దాదాపుగా 10 మంది హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ కు ఈ కథ అవసరమా అని చిరాకు కూడా వచ్చిందట. చివరికి తన తొలి మూవీ హీరో అజిత్ వద్దకు వెళ్లి కథ చెప్పారట. అజిత్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోయిన్ గా శ్రీయా.. విలన్ గా ప్రకాష్ రాజ్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా 2004లో మూవీ అనౌన్స్ చేశారు. మిరాకిల్ టైటిల్ తో అజిత్ ఫోటో షూట్ కూడా చేశారు. 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. ఇంతలోనే అజిత్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
ఎందుకంటే అజిత్ కు నిర్మాతతో పడలేదని అజిత్ షెడ్యూల్ చేంజ్ చేయమనడంతో నిర్మాత ఒప్పుకోకపోవడంతో అజిత్ తప్పుకున్నారు. ఇక చేసేది ఏమీ లేక నిర్మాతలు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. కానీ మురుగదాస్ లో కసి మాత్రం పోవడం లేదు. ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. చివరికి సూర్యను కలిశారాయన. కథ విన్నాక ఇలాంటి రోల్స్ కోసమే నేను ఎదురు చూస్తున్నానని సూర్య ఒప్పేసుకున్నారు. ఇక షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సూర్యకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది.