టర్కీ, సిరియాలలో వచ్చిన భూకంపం ధాటికి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన విషయం విదితమే. ఫిబ్రవరి 6వ తేదీన వచ్చిన ఈ భూకంపం కారణంగా రెండు దేశాల్లోనూ ఇప్పటి వరకు 33వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఎంతో మంది శిథిలాల కిందే ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు సైతం ఆ రెండు దేశాలకు తమ చేతనైన సహాయం అందిస్తున్నాయి. భారత్‌కు చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
అయితే టర్కీ, సిరియాలలో భూకంపం వస్తుందని ఓ సైంటిస్టు ముందుగానే చెప్పారు. అయితే భూకంపం వచ్చాక ఆయన అంతకు ముందు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు.. అని అందరూ సందేహిస్తున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ అనే పరిశోధకుడు గతంలోనే సిరియా, టర్కీ భూకంపాల గురించి చెప్పారు. అయితే అప్పట్లో ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ భూకంపం తరువాత ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే చాలా మంది ఆయన చెబుతున్న విషయాలను నమ్ముతున్నారు. ఇక త్వరలోనే ఇండియాకు కూడా భూకంపం వస్తుందని ఆయన చెప్పారు. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
జనవరి 29వ తేదీన హూగర్‌బీట్స్ మరో కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే హిందూ మహాసముద్రంలో నెలకొనే అలజడి కారణంగా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాలలో తీవ్రమైన భూకంపం వస్తుందని.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.0కు పైగా ఉండే అవకాశం ఉంటుందని.. అన్నారు. దీంతో హూగర్‌బీట్స్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వాస్తవానికి భూకంపాలను అంత కచ్చితంగా అంచనా వేసే సైన్స్, టెక్నాలజీ ఏదీ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. అలా ఉంటే ముందుగానే అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.
కానీ అలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు కనుక భూకంపాల విషయంలో మనం చేసేది ఏమీ లేదు. అయితే చరిత్రను బట్టి, స్థలాన్ని అనుసరించి.. భూకంపం వస్తుందా.. రాదా.. అనే విషయాన్ని మాత్రమే అంచనా వేయచ్చని.. కానీ కచ్చితంగా ఫలానా తేదీ రోజు ఫలానా సమయంలో ఫలానా ప్రదేశంలో భూకంపం వస్తుంది.. అన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరని.. ఇక హూగర్ బీట్స్ ఏదో జాతకం చెబుతున్నట్లు చెబుతున్నాడు కానీ.. ఆయన మాటల్లో వాస్తవం లేదని.. కొందరు అంటున్నారు. మరి టర్కీ, సిరియాల విషయంలో ఆయన ప్రకటన నిజమైనట్లుగానే.. త్వరలో ఇండియా విషయంలో సైతం ఆయన ప్రకటన నిజమవుతుందా.. కాదా.. అనేది త్వరలో తేలనుంది.