Daana Veera Soora Karna : పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించే వ్యక్తి.. ఎన్‌టీఆర్. ఆయన ఎన్నో సినిమాల్లో జీవించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అందుకనే ఆయన టాలీవుడ్‌లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అయ్యారు. ఆయన సాంఘిక పాత్రలతోపాటు పౌరాణిక పాత్రలు వేయడంలో తనకు తానే తానే సాటి అని నిరూపించారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఒక దుర్యోధనుడు అంటే మన కళ్ల ముందు ఎన్టీఆర్ పోషించిన పాత్రలే గుర్తుకొస్తాయి.
ఇక తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం పౌరాణిక పాత్రలు అంటే మనకు ముందుగా ఎన్టీఆర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్‌కు ఈ విషయంలో సాటిరాగల హీరో ఎవరైనా ఉంటారా..? అంటే కనుచూపు మేరలో ఎవరూ కనిపించరనే చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాల్లో దానవీరశూరకర్ణ కూడా ఒకటి. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమాను ఎన్టీఆర్ తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడంతోపాటు దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడిగా మూడు విభిన్న పాత్రల్లో నటించారు.
![Daana Veera Soora Karna : దానవీరశూరకర్ణకు పెట్టిన ఖర్చు రూ.20 లక్షలు.. ఎంత వసూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..! Daana Veera Soora Karna budget rs 20 lakhs collections will surprise you](http://3.0.182.119/wp-content/uploads/2022/09/daana-veera-soora-karna.jpg)
ఎన్టీఆర్ తనయులు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఈ సినిమాలో నటించారు. ఇక శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్టీఆర్ తన జీవితంలో ఎప్పటికైనా పూర్తిస్థాయి కర్ణుడి పాత్ర చేయాలని నిర్ణయానికి వచ్చేశారు. ఆ కోరికను ఎన్టీఆర్ తన దానవీర శూరకర్ణతో తీర్చుకున్నారు. కాగా అప్పట్లో రూ.20 లక్షలతో తీసిన ఈ సినిమాను మూడు సార్లు విడుదల చేశారు. రూ. 20 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 15 రెట్లు ఎక్కువగా లాభాలు తీసుకొచ్చింది. అప్పట్లో రూ.3 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది.
4 గంటలకు పైగా నిడివితో అప్పట్లో 25 రీల్స్‌తో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారతదేశ సినిమా చరిత్రలోనే పెద్ద సినిమాగా రికార్డులను సృష్టించింది. ఇంకా చిత్రమేమిటంటే ఎన్టీఆర్ రచన, స్క్రీన్‌ప్లే దర్శకత్వం వహించిన ఈ సినిమా అంత పొడవు ఉన్నా ఎక్కడా ప్రేక్షకులకు విసుగు లేకుండా ఎన్టీఆర్ తన నటన, దర్శకత్వ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ రికార్డు ఏ సినిమాకు రాలేదు. ఇక ఇదే సినిమా కథతో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కమలాకర కామేశ్వర్‌రావు దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం ఫ్లాప్ అయింది. తరువాత రంభ ఊర్వశి మేనకా సినిమా విడుదల అయింది. మురళీమోహన్, నరసింహరాజు కీలక పాత్రల్లో నటించగా రావు గోపాలరావు రోజా రమణి కూడా ప్రధాన పాత్రలు పోషించారు. సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా దానవీరశూరకర్ణ ప్రభంజనం ముందు నిలబడలేక పరాజయం పాలైంది. ఇలా అప్పట్లో దానవీరశూర కర్ణ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.