CM YS Jagan : మరి కొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.పార్టీలు కొత్త ప్రణాళికలు రచిస్తూ గెలుపు గుర్రం ఎక్కాలని తహతహలాడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ గతంలో మాదిరిగా 175కి 175 సీట్లు గెలవాలని తహతహలాడుతుంది. ఈ క్రమంలోనే వైసీపీలో కుండమార్పిడి విధానం తప్పదనే అనిపిస్తోంది. పార్టీలో కుండమార్పిడి విధానం ఏమిటంటే ఎంఎల్ఏలు ఎంపీలుగా పోటీచేయటం ఎంపీలు ఎంఎల్ఏలుగా రంగంలోకి దిగటం అన్నమాట. స్ధానిక పరిస్ధితులు, ప్రజాప్రతినిధుల మీద ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని జగన్ కుండమార్పిడి విధానానికి కొన్ని నియోజకవర్గాల్లో చేయాలని అనుకుంటున్నాడట.
సుమారు 10 నియోజకవర్గాల్లో అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ ఎంఎల్ఏగా పోటీచేయించబోతున్నారు. అలాగే ఇపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని రాబోయే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభకు పోటీచేయించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు వేమిరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు. ఇక కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చేఎన్నికల్లో పిఠాపురం ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశం ఉందని సమాచారం. మంత్రి పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీకి దిగే అవకాశాలున్నాయట.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు ఎంఎల్ఏగా పోటీచేస్తారని పార్టీలో టాక్. ఇల మొత్తంమీద సుమారు పదినియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులుండవచ్చని నేతలకు సూచనలు అందుతున్నాయట.గతంలోను ఇలాంటి ప్రయోగాలు చేయడం మనం చూశాం. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నెలవుల సుబ్రమణ్యంను తర్వాత సూళ్ళూరుపేట ఎంఎల్ఏగా కాంగ్రెస్ అధిష్టానం పోటీచేయించింది. అలాగే 2014లో తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్ ను 2019 ఎన్నికల్లో గూడూరు ఎంఎల్ఏగా పోటీచేయించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు ఫలిస్తుందన్నది తెలియాల్సి ఉంది.