Chiranjeevi In Navy : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని దశాబ్ధాలుగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు చిరు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో తెలుగు సినీ ప్రేమికులని అలరించిన చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రంతో పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కరోనా సమయం నుండి చిరంజీవి సోషల్ మీడియా పోస్ట్‌లతో కూడా సినీ ప్రేమికులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు. ఆదివారం నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫొటో పంచుకున్నారు చిరంజీవి. అది కాలేజ్ రోజుల నాటి ఫోటో కాగా, అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు.
గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని వెల్లడించిన చిరంజీవి, తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని తెలిపారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానని వివరించారు. కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.
![Chiranjeevi In Navy : నేవీ యూనిఫామ్ లో కనిపిస్తున్న చిరు.. ఇంతకీ అసలు ఈ ఫొటో కథేంటి..? Chiranjeevi In Navy what is the story behind it](http://3.0.182.119/wp-content/uploads/2022/12/chiranjeevi-in-navy.jpg)
ఇక ఈ మధ్యే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో మెగాస్టార్‌ను ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి.. ‘కొన్ని గుర్తింపులు ప్రత్యేకమైనవి. ఈ అవార్డు కూడా అలాంటిదే. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నాకు లభించిన కీర్తి, పేరు, చరిష్మా, అభిమానుల అమూల్యమైన ప్రేమ ఆప్యాయత, ప్రతిదానికీ నేను చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రులకు కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా పుట్టినా మళ్లీ చిరంజీవిగా సినీ పరిశ్రమలో పుట్టాను అని అన్నారు. అన్ని రంగాలలో కరప్షన్ ఉంటుంది కాని,సినీ రంగంలో ఉండదు అని జీవితాంతం నటనను కొనసాగిస్తానని చిరంజీవి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.