Barrelakka : ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో సాగుతున్న విషయం తెలిసిందే. మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్పీడ్ పెంచారు. అయితే తెలంగాణ ఎన్నిక ప్రచారంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, భట్టి విక్రమార్క వంటి వారు జోరుగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు… వారి కంటే ఎక్కువగా నిరుద్యోగ యువతి బర్రెలక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిరుద్యోగుల ప్రతినిధిగా బర్రెలక్క ఎన్నికల బరిలోకి దిగగా, ఆమెకు మద్దతు ఓ రేంజ్ లో వస్తుండడంతో ప్రచారం మరింత ముమ్మరం చేశారు.బర్రెలక్క అలియాస్ శిరీషా ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది.
బర్రెలు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా అనూహ్యంగా నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంంది.నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికారు. శిరీషాకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించడంతో విజిల్ వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో బర్రెలక్క ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది.బర్రెలక్క ఎన్నికల ప్రచార ఖర్చు కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు రూ.లక్ష విరాళం పంపించారు. స్థానికంగ ఉన్న కొంతమంది చందాలు వేసుకుని బర్రెలక్క ప్రచారానికి సహకరిస్తున్నారు. బర్రెలక్క ఈ మధ్య పాట కూడా వచ్చింది. “కదిలే ఓ అడుగు యువతకు నువ్వు వెలుగు కదిలింది మన బర్రెలక్క అదిగో లేవర యువత” అంటూ ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొన్నాళ్ల క్రితం శిరీష.. హాయ్ ఫ్రెండ్స్.. ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగం రావడం లేదు. మాయమ్మను అడిగి నాలుగు బర్లు కొన్న. ఉదయం, సాయంత్రం ఆరు లీటర్ల పాలు ఇస్తాయి” అని వీడియోలో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన వారు తనపై కేసు పెట్టారని బర్రెలక్క చెప్పింది. అయినా భయపడకుండా బర్రెలక్క పోరాటం చేస్తోంది.