ఆటలో సాధారణంగా గెలుపోటములు అనేవి ఉంటాయి. ఒకరు ఓడడం.. మరొకరు గెలవడం.. అనేది సహజమే. కానీ ఆటతో భావోద్వేగాలు కూడా ముడిపడి ఉంటాయి. అందువల్ల ఓటమి పాలైన జట్టు తాలూకు అభిమానులు దాన్ని జీర్ణించుకోలేరు. అందులోనూ సాధారణ మ్యాచ్‌లు అయితే ఓకే. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లలో ఓటమి పాలైతే అంతే సంగతులు. ఇంటికి పలాయనం చిత్తగించాల్సిందే. అలాంటప్పుడు అభిమానుల భావోద్వేగాలు తారా స్థాయిలో ఉంటాయి. ఒక చిన్న ఫీల్డింగ్ తప్పిదం చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇలాంటి సమయాల్లో అభిమానులు తీవ్రంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఎంతలా అంటే.. ఆట ఆడే ప్లేయర్‌కు అంత ఒత్తిడి ఉండదు. కానీ అభిమానులకు ఉంటుంది. అంతలా వారు ఒత్తిడికి గురవుతుంటారు.
ఇక ఓటమి పాలైన జట్టు నిష్క్రమించక తప్పదు. అది తెలిసిన విషయమే. కానీ అభిమానులు మాత్రం తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేరు. దీంతో వారు ప్రత్యర్థి జట్టుపై అవాకులు చెవాకులు పేలుతుంటారు. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో ఇది బాగా ఎక్కువైంది. తమ జట్టు ఓడి ప్రత్యర్థి జట్టు గెలిస్తే వారిపై ఛండాలమైన రాతలు, ట్రోల్స్.. ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. ఓడిన తరువాత అవతలి జట్టు వారు చీటింగ్ చేశారు.. అందుకనే ఓడిపోయాం అనడం సర్వ సాధారణం అయిపోయింది. మొన్నటి పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ అలాగే జరిగింది. ఇప్పుడు బంగ్లా మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఫ్యాన్స్ అదే అంటున్నారు. వాస్తవానికి ఆ స్థానంలో ఇండియా ఉన్నా ఇండియన్లు ఏమీ ఊరుకునే టైప్ కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పాక్, బంగ్లా అభిమానులు మరీ కాస్త అతి చేస్తారనే చెప్పవచ్చు.
బంగ్లా జట్టు ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలదు. కానీ ఆ జట్టుకు వరల్డ్ కప్ గెలిచేంత స్టామినా లేదు. ఆ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఈ విషయాన్ని వరల్డ్ కప్‌కు ముందు స్వయంగా చెప్పాడు. మేం కప్ కొట్టేందుకు రాలేదు, ఇతర జట్లకు డిజప్పాయింట్‌మెంట్ అందించేందుకు వచ్చాం అన్నాడు. అంటే.. అక్కడే ఆ జట్టు ఉద్దేశం ఏమిటో తేలిపోయింది. అలాంటప్పుడు మ్యాచ్ ఓడితే ఫ్యాన్స్ అంతలా అతి చేయాల్సిన పనిలేదు. వర్షం సహాయ పడిందని, వర్షం కారణంగా మ్యాచ్ ఆగితే రద్దు చేయాలి కానీ మళ్లీ ఎలా కొనసాగిస్తారని.. కోహ్లి అడిగితే నో బాల్ ఇచ్చారు, తమకు వైడ్ ఇవ్వలేదని.. ఇలా రక రకాల వితండ వాదనలు చేస్తున్నారు.
కానీ మ్యాచ్ అన్నాక ఇవన్నీ సహజం. ఇలాంటివి ప్రతి జట్టుకు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఆడలేక మద్దెల ఓడన్నట్లు.. ఇలా వ్యవహరించడం సరి కాదు. ప్రత్యర్థి జట్లపై నిందలు వేయడం మాని.. తమ జట్టు ప్లేయర్లను ప్రోత్సహించాలి. అలా చేస్తేనే.. వారు ప్రేరణ పొంది ఇంకా బాగా ఆడేందుకు.. మెరుగైన ప్రదర్శన చేసేందుకు.. అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా గెలిచిన ప్రత్యర్థి జట్లను నిందించడమే పనిగా పెట్టుకుంటే మాత్రం.. అది ఓడిన జట్లకు మంచిది కాదనే చెప్పాలి.. ఇకనైనా ఇలాంటి ప్రవర్తన మానుకుంటే మంచిది.