టీ20 ప్రపంచకప్ 2022 టీం ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో ఘన విజయాన్ని అందుకుంది. అడిలైడ్ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా టీం ఇండియా గ్రూప్ 2లో పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ మిగిల్చిన ఓటమి- బంగ్లాదేశ్ జట్టుకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్టయింది. టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి కారకుడైన విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు గుప్పించింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ విమర్శించింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు కూడా ఆవిరైపోయాయి.
దీంతో ఇప్పుడు కూడా టీమిండియాపై ఛీటింగ్ ఆరోపణలు చేస్తున్నారు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అభిమానులు. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ హైట్ నో బాల్‌కి అప్పీలు చేయడం, అంపైర్లు నో బాల్ ఇవ్వడంపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ నో బాల్ అడిగితే ఇచ్చేస్తారా? అన్నట్టు అంపైర్లతో వాదించాడు. అయితే అప్పటికే ఆ ఓవర్‌లో మొదటి బంతికి బౌన్సర్ వేశాడు సదరు బౌలర్. దీంతో అంపైర్లు నో బాల్ ఇవ్వాల్సి వచ్చింది. అంపైర్లు ఇవ్వడానికంటే ముందే విరాట్ కోహ్లీ అప్పీలు చేశాడంతే! దీంతో పాటు అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకి రావాల్సిన 5 పరుగులు రాలేదని ఆరోపిస్తున్నాడు బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్.
బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్ సింగ్, నేరుగా బౌలర్‌కి త్రో వేశాడు. అయితే మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ బంతి అందుకుని, త్రో చేసినట్టుగా చేతులతో యాక్షన్ చేశాడు. ఇది ఐసీసీ రూల్స్ ప్రకారం ఫేక్ ఫీల్డింగ్ అంటున్నారు నురుల్ హసన్. ఐసీసీ నియమావళిలో 41.5 రూల్ ప్రకారం బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో ఫీల్డర్లు కావాలనే చేసే పనులు అన్‌ఫెయిర్ ప్లేగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాల్లో బ్యాటర్ అప్పీలు చేస్తే 5 పరుగులు పెనాల్టీ రూపంలో వస్తాయి. అయితే విరాట్ చేసిన పనిని క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాటర్లు గమనించలేదు. దీంతో అతనిది ఫేక్ ఫీల్డింగ్ అయినా, బ్యాటర్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వాళ్లు అప్పీలు చేయనప్పుడు 5 పరుగుల పెనాల్టీ ఆశించడం బంగ్లా అత్యాశే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.