AP Elections Betting : ఇటీవల బెట్టింగ్ ఏ రేంజ్‌లో నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి వస్తే కోడి పందాలు. సమ్మర్ వస్తే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఇప్పుడు ఎన్నికలు కూడా పందెంరాయుళ్ల జోరుని పెంచుతున్నాయి. ఇప్పటికే రూ. కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ గడువు సమీపించే కొద్దీ ఈ వ్యవహారం మరింత జోరు అందుకునే వాతావరణం ఉందని భావిస్తున్నారు. ఆంధ్ర పొలిటికల్ లీగ్ పోటీలో విజేత ఎవరు? ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది?? ఫలానా అభ్యర్థి గెలుస్తాడు అని బెట్టింగ్ జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఆంధ్ర రాజకీయ నాయకులపై ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. వేలు, లక్షలు పందాలు కాస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా ఇలా బెట్టింగ్లకు పాల్పడడం చట్టరీత్యా నేరం.
లోపాయికారీగా మాటలు, ఒప్పందాలు, చేతులు మారుతున్న డబ్బు రహస్యంగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఈ సమాచారం పోలీసుల వరకు చేరడం లేదు. కారణం వ్యక్తులు పార్టీల మధ్య సాగుతున్న బెట్టింగ్లు భారీ స్థాయిలో ఉన్నట్లు చెబుతున్నారు.పోలింగ్ సరళి చూసిన తర్వాత.. పూర్తి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత.. ఏపీలో ఎన్డీయే కూటమికి వంద సీట్లు దాటతాయంటూ ఎక్కువమంది బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారట. ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనేదానిపై ఎక్కువ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
అయితే కూటమి గెలుపుపై ఓ వ్యక్తి రూ.40 కోట్లు బెట్టింగ్ పెట్టాడట. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్షన్స్ ప్రిడిక్షన్ చేయడం, 2004 నుండి ఆయన సర్వేలు చేస్తూ ఉండేవారు. వాటి ద్వారానే రాజకీయాలలోకి వచ్చారు. సర్వేల రిపోర్టుల ఆధారంగా అధికారంలోకి వచ్చే పార్టీలో చేరి తర్వాత రాజకీయంగా కూడా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన కూటమిపై అంత భారీగా బెట్టింగ్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఆయన ఎవరు అని తెగ ఆరాలు తీస్తున్నారు.