Anam Rama Narayana Reddy : ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి. అధికారంలో ఉన్న వారితో పాటు ప్రత్యర్ధులు సైతం మాటల తూటాలు పేలుస్తూ వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం వారితో విభేదించడం మొదలుపెట్టి, చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ నుంచి సస్పెండైన ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, అంతమొందించడానికి అందరూ కలిసి రావాలని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
వాలంటీర్ల వ్యవస్ధను సైతం నిర్వీర్యం చేసి పార్టీ పరంగా పనిచేసే గృహసారధుల వ్యవస్ధను తీసుకొచ్చారని ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు . అసెంబ్లీ సమావేశాలు కూడా గతంలో 70 రోజులు జరిగేవని, కానీ ఇప్పుడు 20 రోజులు జరగడమే కష్టంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే అన్నీ జరిగిపోతున్నాయని ఆనం తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు అధికారం లేదు, అలానే ఎంపీలకు అధికారం లేదు, గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచికి కూడా అధికారం లేదు అని వెల్లడించారు. వాలంటీర్ కు ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదని, ఈ విషయం చెప్పడానికి తానేమీ బాధపడడంలేదని తెలిపారు.
ఈ నాలుగేళ్లలో అన్ని చూసి, ఇప్పుడు దూరంగా ఉంటున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టలేమని నిలిపివేశారు. పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ జనం కూడా నవ్వులపాలవుతున్నారు. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏపీలో ఒక లే అవుట్ వేసి ఒక ప్లాట్ అమ్మేవాడు కూడా కనిపించడంలేదు… లే అవుట్ వేసినా, బిల్డింగ్ కట్టినా, అలాంటివాళ్లు తెలంగాణలో ఉన్నారు. నాడు అమరావతి అంటూ వచ్చిన వారందరూ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వెళ్లిపోయారు. ఏపీ నుంచి హైదరాబద్ వెళ్లినవారు అప్పట్లో కోడిపందాలకైనా వచ్చేవారు, ఇప్పుడు ఆ కోడిపందాలకు కూడా ఎవరు రావడం లేదని ఆనం తెలియజేశారు.