ప్రస్తుత తరుణంలో మనం ఆరోగ్యకరమైన, పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనకు వస్తున్న అనారోగ్యాలను తట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మనం సీజనల్‌గా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మనకు సీజనల్‌గా లభించే కూరగాయల్లో బోడకాకర కాయలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
బోడకాకరకాయలనే కొందరు ఆగాకరకాయలు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి. బోడకాకరకాయలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
బోడ కాకరకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఈ కాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా బోడ కాకరకాయల వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక వీటిని ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.