టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ చిత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి మహేశ్ సినీ కెరీర్ లో నే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేయగా, ఈ మూవీ లోని యాక్షన్ సీక్వెన్సెస్, మహేశ్, భూమిక, ప్రకాశ్ రాజ్ ల మధ్య సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, ఆ సీన్ లో ధర్మ వరపు తన ఫోన్ నెంబర్ 98480 32919 అని చెప్తుంటాడు. ఆ నెంబర్ ఎవరిది? ఆ సీన్ లో ఆ నెంబరే ఎందుకు పెట్టారు? అనే సంగతుల గురించి మీకు తెలుసా?
ఒక్కడు చిత్రంలో చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు. పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పండింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరగా, ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం.. పాస్ పోర్ట్ కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం ప్రేక్షకులకి ఎంతో సరదాగా అనిపించింది. అయితే ఆ ఫోన్ నంబర్ ఎవరి నంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా.. ఎవరిదో ఎందుకు.. నిర్మాత నంబరే వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట.
దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు. సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ కు కొన్ని లక్షల కాల్స్ వెళ్లాయట. దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నంబర్ మార్చేసుకున్నారు. చాలా మంది ఆ టైంలో ఈ నెంబర్ అసలు రింగ్ అవుతుందా? లేదా ? అని ప్రతీ రోజు ట్రై చేసేవారట. ఇది ఆ ఫోన్ నెంబర్ వెనుక ఉన్న అసలు కథ. కాగా, మురారి సినిమాతో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబుకి ఒక్కడు సినిమాతో స్టార్ డమ్ వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సంచలన రికార్డులు తిరగరాసింది. ఏకంగా 100 సెంటర్లకు పైగా వంద రోజులు ఆడింది. గుణశేఖర్ కూడా ఒక్కడు సినిమాతో స్టార్ డైరెక్ట్రర్ అయిపోయాడు.