Balakrishna : టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకోగా, ఆయన కుమారుడిగా వచ్చిన బాలకృష్ణ కూడా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు చూరగొన్నాడు.ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల బాలయ్య మాట్లాడుతూ.. మోక్షజ్ఞని ఎప్పుడు, ఏ సమయంలో సినిమా రంగ ప్రవేశం చేయించాలనే స్పష్టత ఆ కుటుంబానికి ఉందని, అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఏ దర్శకుడు సెట్ అవుతారో వారే పరిచయం చేస్తారుకానీ నేనే లాంచ్ చేస్తానని గ్యారంటీగా చెప్పలేనన్నారు.
మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో బాలయ్య చిన్న అల్లుడు భరత్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ చిన్నల్లుడు…. గీతం విద్యా సంస్థల అధిపతి అయిన భరత్ కి సినిమా పరిశ్రమపై కూడా కాస్త మక్కువ ఉండడంతో భరత్ తరపునుంచి ఆయన భార్య.. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా ఉంటారని వార్తలొస్తున్నాయి. ఇక బాలయ్యతో బోయపాటి తెరకెక్కిస్తున్న నెక్ట్స్ సినిమాలో కూడా కొంత వాటాను తేజస్విని ఆమె భర్త భరత్ లు పెట్టబోతున్నట్టు వినికిడి. కాగా బాలయ్య-బోయపాటి సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇందులో మరికొంత మందిని భాగ్వాములుగా తీసుకునే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ఇరవై శాతం పెట్టుబడి పెట్టడానికి తేజస్విని, ఆమె భర్త భరత్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాను 2023 జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి సినిమా చేస్తుండగా, సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి మూవీ చేసి అనంతరం బోయపాటితో మరో చిత్రం చేయనున్నట్టు వినికిడి.