Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ఎంతో మంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ తర్వాత అగ్రహీరోగా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరిన చిరంజీవి తన తండ్రిని పలు సందర్భాలలో గుర్తు చేసుకుంటారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. ఆయన కూడా సినిమాల్లో నటించారన్న సంగతి చాలామందికి తెలియదు.
చిరంజీవి సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ సినిమాలో ఆయన చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన పెద్ద కుమారుడైన శివశంకర వరప్రసాద్(చిరంజీవి)ని సినిమాల వైపు ప్రోత్సహించడంతో చిరు ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు 2007లో మరణించారు. నేడు ఆయన వర్ధంతికాగా, తండ్రి సంవత్సరీకం సందర్భంగా చిరు ట్విటర్ లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ.. ‘ అని చిరంజీవి ట్వీట్ చేశారు. సంవత్సరీకం సందర్భంగా తండ్రికి నివాళులు అర్పిస్తూ పూజ చేస్తున్న ఫోటోలని కూడా చిరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులు, తల్లి అంజనా దేవి, చెల్లెల్లు, నాగబాబు ఉన్నారు. పవన్ ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో తండ్రి సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్నట్టు లేదు.ఇక చిరంజీవి షేర్ చేసిన ఫొటోలలో ఒక ఫొటోలో పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నోడు ఎక్కడైనా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.