Sharwanand : సినిమా పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే టాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చాలా ఎమోషనల్ డ్రామాగా రూపొందినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శర్వానంద్ తన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. అందులో తన తల్లి బంగారు నగలు అమ్మిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది.
గతంలో శర్వానంద్ కో అంటే కోటి అనే ఒక సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇక పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్ళాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. నా ముఖం ఎవరికీ చూపించలేకపోయాను అని అన్నాడు శర్వానంద్. అంతకుముందు మా అమ్మ బంగారం అమ్మి మరీ కో అంటే కోటి సినిమాని నిర్మాతగా తీశాను. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోయాయి, రిలేషన్స్ కూడా దూరమయ్యాయి.
అప్పుడు చాలా బాధపడ్డాను. దానివల్ల అయిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాల పాటు నాకు సొంతంగా ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలేదు అని స్పష్టం చేశాడు. ఇక రన్ రాజా రన్ సినిమా హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న ఇంటికి పిలిచి మరీ పార్టీ ఇచ్చాడని.. అయితే తాను నమ్మలేదని.. సోమవారం వరకు ఆగితే కానీ తాను సినిమా హిట్ అన్నది నమ్మనని చెప్పాడు. అలా తాను ఆ సమయంలో సక్సెస్‌లు కూడా ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నానని ఆ బాధలు చెప్పుకు వచ్చాడు. మరి ప్రతి స్టార్ వెనుక ఇలాంటి గాథలు కామనే కదా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.