Kesineni Nani Daughter Swetha : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ టిడిపిలో అంతర్గత విబేధాలు భగ్గుమంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు వైసీపీ నుండి పక్కకు తప్పుకోగా, మరికొందరు టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారు. కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా వున్న విబేధాలు ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారాయి. ఈ క్రమంలో టిడిపి నాయకత్వం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు. కార్పోరేటర్ పదవితో పాటు టిడిపికి కూతురు శ్వేత రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు.
ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కూతురు, టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేసారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందజేసారు శ్వేత. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని… వెంటనే ఆమోదించాలని మేయర్ ను కోరారు కేశినేని శ్వేత. ప్రస్తుతం శ్వేత విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు. విఎంసి కార్యాలయానికి వెళ్లేముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను కలిసారు శ్వేత. గతంలో తమకు మద్దతుగా నిలిచి కార్పోరేటర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు రాజీనామా విషయం తెలియజేయాలనే కలిసానట్లు శ్వేత తెలిపారు.
తనకు భీపామ్ ఇచ్చి గెలుపుకు కృషిచేసిన ఎమ్మెల్యే గద్దెకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. గద్దె కుటుంబం తమకు ఫ్యామిలీ స్నేహం కూడా వుందని శ్వేత తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేకు వివరించానని ఆమె వెల్లడించారు. ఇక శ్వేతతో భేటీపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా స్పందించారు. రాజీనామాకు ముందు మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఆమె తనవద్దకు వచ్చిందన్నారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పిందన్నారు. ఇది ఆమోదం పొందినతర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు శ్వేత చెప్పిందన్నారు. తాను ఆల్ ది బెస్ట్ చెప్పి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించానని అన్నారు. శ్వేతను కలిసిన విషయంపై అదిష్టానం సంప్రదిస్తే జరిగింది చెబుతానని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు.