Botsa Satyanarayana : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వడివడిగా సాగుతున్నాయి.ప్రస్తుతం వైసీపీలో టికెట్ కోసం నేతలు తెగ ఆరాటడుతుంటారు. విజయనగరం జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు ఈ సారి బరిలో నేనున్నా అంటున్నారట. అటు మేనమామ అండదండలు.. ఇటు పార్టీ సపోర్ట్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారట. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎవరి సీటుకు ఎసరు పెడతారనే టెన్షన్ మొదలైందట.ఉత్తరాంధ్రలో కీలక మంత్రి బొత్స పోటీపై సస్పెన్స్ నెలకొంది. చీపురుపల్లి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన మంత్రి బొత్స.. మళ్లీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని.. ఆయన స్థానంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను బరిలో దిగుతారనే టాక్ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
బొత్స సొంత మేనల్లుడైన చిన్నశ్రీను చాలాకాలం తెరచాటు రాజకీయానికే పరిమితమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీతానై వ్యవహరిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో చిన్నశ్రీనును ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తోన్న వైసీపీ.. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలోనే పోటీకి పెట్టాలని నిర్ణయించడమే ఉత్కంఠకు దారితీస్తోంది.. చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి? మామను ధిక్కరించి చిన్నశ్రీను పోటీ చేస్తారా? అనే ప్రశ్న మెదులుతుంది.ఇక జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన చిన్నశ్రీనును వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చిన్నశ్రీను రాజకీయంగా జిల్లాపై మంచి పట్టుసాధించారు.
జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో కలిసి జిల్లా మొత్తం తిరిగారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న చిన్నశ్రీను.. జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఇక వచ్చే ఎన్నికల్లో సీనియర్లను ఎంపీలుగా పంపి.. కొత్తవారిని ఎమ్మెల్యేలు చేయాలని నిర్ణయించిన వైసీసీ.. బొత్సను విజయనగరం ఎంపీగా పంపి.. ఆయన స్థానంలో చిన్నశ్రీనును పోటీకి పెట్టాలని ప్రయత్నించడమే హాట్‌టాపిక్ అవుతోంది.