Janasena Kiran : జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు అని ఆయన అన్నారు. ఇప్పటివరకు నా కులంపై విమర్శలు చేశారు, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. మంత్రి రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిలు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇళ్ల పట్టాల్లో ఓ వైపు వెంకటేశ్వర స్వామి చిత్రం ముద్రించగా.. మరో వైపు సీఎం జగన్ ఫోటో ఎలా ముద్రిస్తారని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
దీనిపై ఆందోళన చేపడతారన్న నేపథ్యంలో కిరణ్ రాయల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను ఏపీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీనిపైన జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గతంలో ఆయనపై పలు ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులు. నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయిస్తున్నా అని ఇదివరకు నిరాధార ఆరోపణలు చేశారు. నా కులం గురించి ప్రశ్నించారు. ఇప్పుడు ఓ మహిళను అడ్డుపెట్టుకొని నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమవుతున్నారు.
భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. అతడి ఆడియో నా దగ్గర ఉంది. ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించి ఫిర్యాదు చేశాను. ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతాను. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా..? నేను భయపడను. నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి. నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు” అని కిరణ్ రాయల్ అన్నారు.