Sonia Gandhi : ఈ రోజు తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ప్రగతి భవన్ ఇకపై ప్రజాభవన్‌గా మారబోతోందని.. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల విషయంలోనూ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని పేర్కొన్న రేవంత్.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో, తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయన్నారు. త్వరలోనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే.. రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి సోనియా ఆశీర్వాదం తీసుకున్నారు. సోనియగాంధీ కాళ్లు మొక్కారు రేవంత్ దంపతులు.
రేవంత్ తన కూతురు అల్లుడిని కూడా పిలిచారు. వారిని సోనియా,రాహుల్‌లకి పరిచయం చేశారు. అయితే సోనియా వేదికపైకి వచ్చినప్పుడు రేవంత్ మనవడిని ముద్దాడింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా బాబు క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్ చేసి ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటూ.. మరో 11 మంది కూడా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోద రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు.