Seethakka : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేసారు.. ఆయనతో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైకమండ్ పెద్దల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది. ప్రమాణస్వీకారానికి సీతక్కని పిలిచిన వెంటనే ఆమె వేదికపైకి చేరుకోగానే అభిమానులు కేరింతలతో హోరెత్తారు.
ఎల్బీ స్టేడియం ప్రాంగణమంతా మోత మోగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన అభిమానులకు అభివాదం చేసిన సీతక్క మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెబితే సీతక్క మాత్రం దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు. తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని,భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, తెలంగాణా రాష్ట్ర మంత్రిగా, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్త శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను” అంటూ ప్రమాణం చేశారు.
సీతక్క ప్రమాణస్వీకారం అనంతరం కూడా స్టేడియంలో జయ జయ ధ్వానాలు మారుమోగాయి. అనంతరం సీతక్క ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హత్తుకుని, నవ్వుతూ ఆమె భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. సీతక్క మాత్రమే కాదు కొండా సురేఖను సైతం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆలింగనం చేసుకోవడంతో కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తాను ములుగు నియోజకవర్గ ప్రజలకు సేవకురాలినేనని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మంత్రి పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే తెలంగాణ ప్రజలు తనపై మరింత పెద్ద బాధ్యతను పెట్టారని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యానికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.