Atchem Naidu : 2024 ఎన్నికలలో సత్తా చాటేందుకు టీడీపీ-జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబ జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్.. జనసేనతో పొత్తు కుదుర్చుకున్నట్టు తెలియజేశాడు. అప్పటి నుండి జనసేన- టీడీపీ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. రీసెంట్గా అచ్చెన్నాయుడు ఒక ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వర్షపాతం లేదని, దుర్భిక్షం తాండవిస్తోందని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో కరవే లేదని ముఖ్యమంత్రి అంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
కరవును ప్రధాన అంశంగా తీసుకుని టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని వెల్లడించారు. తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయించామని తెలిపారు. ఆత్మీయ సమావేశాలు ఏ నియోజకవర్గంలో ఎప్పుడు అనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళుతున్నారని తెలిపారు. ఇక, ఇరు పార్టీల నుంచి పార్టీకి ముగ్గురు చొప్పున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీలో ఉంటారని అచ్చెన్నాయుడు వివరించారు.
జనసేన ప్రతిపాదించిన ఆరు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కమ్మ సామాజికవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రాజకీయవర్గాల్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం చర్చకు దారితీయడంతో దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఆ లేఖ ఫేక్ అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. దీన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు.