Undavalli Sreedevi : తాడికొండ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవల వైసీపీపై దారుణమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ కార్యకర్తలతో తనపై దాడి చేయించారని మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో చాలా ఆవేశంగా మాట్లాడింది. తాడికొండ నియోజకవర్గంలో అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు. రావెలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ ముఖాముఖి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.
ఓ దశలో లోకేశ్ సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ… అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని, అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే లోకేశ్ అని, వారిద్దరూ అమరావతి రైతుల వెన్నంటే ఉంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రైతులను వదిలివేయరని స్పష్టం చేశారు. “మూడు రాజధానులు వద్దు. అమరావతి ముద్దు. మూడు రాజధానులకు మద్దతుగా మీడియా సమావేశాలు పెట్టమంటే పెట్టలేదు. అమరావతి రాజధాని దేవతల రాజధాని. అమరేంద్రుడు పరిపాలన చేసిన ప్రాంతం ఇది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ పరిపాలన బాగుంటుంది. కానీ ఇక్కడ స్త్రీలను అవమానపరుస్తున్నారు. అందుకే ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని ఆమె అన్నారు.
ఉండవల్లి శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు నన్ను హెచ్చరించారు. కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా లోకేశ్ కొండంత భరోసా ఇచ్చారని, నేను ఎలా తిరగ్గలనో ఇప్పుడు వారికి అర్థమై ఉంటుందని అన్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ తనను రోడ్డున పడేశారని ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో ఫోన్లు చేయించి, రకరకాలుగా చిత్రవధ చేశారని కంటతడి పెట్టుకున్నారు. కానీ, నేను ఎప్పుడూ చూడని లోకేశ్ గారు… శ్రీదేవి గారికి మేం మద్దతిస్తాం అని చెప్పారు… అందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఆమె స్పష్టం చేశారు.