Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థతో పాటు ఏపీలో నెలకొన్న సమస్యలపై జనసేనాని గట్టిగా తన వాదన వినిపించారు. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ ద్వారా జగన్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్కరంటే ఒక్క టీచర్ నూ రిక్రూట్ చేయలేదని మండిపడ్డారు. కానీ తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.
బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా ? ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ? ఈ వివరాలన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వీటిపై వైసీపీ గవర్నమెంట్ స్పందించాలన్నారు. ఈ ట్వీట్ కింద ట్యాబ్స్ పంపిణీ మంచిదేనని, కానీ ముందు పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. అలాగే యాప్స్ ఛాయిస్ అని కానీ టీచర్లు తప్పనిసరి అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు పలు మీడియా క్లిప్స్ ను కూడా జత చేశారు.
వీటిలో స్టార్టప్ కంపెనీ బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందనే కథనం ఉంది. అలాగే బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఎంత చెల్లించిందనే వివరాలు కూడా ఉన్నాయి . కరోనా సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అయితే సరైన క్వాలిటీ లేని ఆన్ లైన్ చదువులు.. స్కూళ్ల ప్రారంభం తర్వాత బైజూస్ పై అంతా పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నారు. దీంతో శరవేగంగా ఆ సంస్థ కూలిపోతోంది. బైజూస్ కంటెంట్ పై ఏ మత్రం సానుకూల ఫీడ్ బ్యాక్ లేకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీతో కనీసం రూ. ఏడు వందల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.