Pokiri : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరికి 17 ఏళ్లు పూర్తయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ ఒక్క డైలాగు చాలు పోకిరి స్టామినా ఏంటో చెప్పడానికి. సినిమా వచ్చి 17 ఏళ్లయినా ఇప్పటికీ ఎక్కడో ఓ చోట దీని గురించి, ఇందులోని సంభాషణల గురించి మాట్లాడుతూ ఉంటారు. మహేష్ బాబును టాలీవుడ్ టాప్ హీరోగా మార్చిన సినిమా పోకిరి. శివ తర్వాత మరో అంతటి ఇండస్ట్రీ హిట్ సాధించిన మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించింది.
ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్ రాసుకున్నాడు. పవన్ కు చెప్పాడు కూడా. అయితే ఈ స్టోరీ తనకు నచ్చలేదని చెప్పాడట. ఆ తర్వాత రవితేజతో చేయాలి అనుకున్నాడట. డేట్స్ కుదరకపోవడంతో వెనక్కి తగ్గాడు. ఓ రోజు మహేష్ బాబుకు ఈ స్టోరీ వినిపించాడు. తనకు నచ్చడంతో ఓకే చెప్పాడు. కానీ పూరీ ఈ సినిమాకు పెట్టిన ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ లను మార్చమని మహేష్ సలహా ఇచ్చాడట. పండు, పోకిరి అనే పేర్లను సజెస్ట్ చేశాడు. పూరీ.. పోకిరి అనే టైటిల్ ఓకే చేశాడు.
ఈ సినిమాను 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయింది. 2006 ఏప్రిల్ లో ఎలాంటి అంచనాలు లేకుండా మూవీ రిలీజ్ అయింది. నెమ్మదిగా ప్రారంభమైనా హిట్ టాక్ తో కొద్ది రోజుల్లోనే దుమ్ము లేపింది. జనాలు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు. ఈ సినిమాలోని పాటలు, ఫైట్స్, డైలాగ్స్ అన్ని జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన క్లైమాక్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. అంతకుముందు ఏ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ చూసి ఉండరు. అందుకనే ఈ మూవీ ఆల్ టైమ్ హిట్ రికార్డులను సాధించింది.