Rana Naidu : దగ్గుబాటి వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రధారులుగా రానా నాయుడు అనే ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ ఒక దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ప్రీమియర్ షోలో వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ కోసం కష్టపడి పని చేశామని, ఇది ఒక డార్క్ ఫ్యామిలీ డ్రామా అనేక ఎమోషన్స్, హింస, అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుందంటూ కామెంట్ చేసి వెంటనే నాలుక కర్చుకున్నారు.
ఇందులో ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలకు కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. అలాంటి ఎపిసోడ్లు మొత్తం 10 ఉన్నాయి. అంటే దాదాపు 500 నిమిషాల నిడివి అన్నమాట. కానీ ప్రారంభ ఎపిసోడ్ల తర్వాత స్టోరీ వేగం పుంజుకుంటుంది. కాబట్టి మనకు తెలియకుండా సమయం గడిచిపోతుంది. అయితే మొదటి ఎపిసోడ్‌లోనే చాలా తిట్లు, దుర్భాషలు, లైంగిక దృశ్యాలు, కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని అసభ్య పదజాలం ఉంది. ఇలాంటి షోలో వెంకటేష్‌ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్ కాస్త తగ్గిందని చెబుతున్నారు.
కానీ తెలుగు వర్షెన్ కూడా కాస్త ఘాటుగానే ఉందని చెప్పాలి. అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో తమ అభిమాన హీరోని ఎంపిక చేసినందుకు స్ట్రీమింగ్ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్ పై వెంకటేష్ ఫ్యాన్స్‌లో ఒక వర్గం ఆగ్రహంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్‌లో ఊపందుకోవడం కోసం ఇంకా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ ను కుటుంబంతో కలిసి అస్సలు చూడలేము. ఒంటరిగా లేదా సన్నిహిత మిత్రులతో కలిసి చూడటానికి బాగా సరిపోతుంది. వెంకటేష్‌కు ఇది పూర్తిగా కొత్త తరహా పాత్ర. ఇప్పటివరకు వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో, యాక్షన్ హీరో, కామెడీ హీరో. కానీ ఇందులో పూర్తిగా కొత్త వెంకటేష్‌ను చూడవచ్చు. ప్లేబాయ్‌గా, నెగిటివ్ షేడ్స్ కనబరించే రోల్‌లో నటుడిగా వెంకటేష్ చెలరేగిపోయారు.