ఇప్పుడు వర్షాకాలం అయిన కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది పట్టపగలు కూడా ఏసీలు వాడుతున్నారు. చల్లని గాలిని ఇచ్చే ఏసీ ఒక్కోసారి ప్రాణాలని కూడా హరిస్తుంది. అయితే ఈ మధ్య ఏసీలు పేలడం, షార్ట్ సర్యూట్ వలన ప్రమాదం జరిగి మంటలు చెలరేగడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా చెన్నై శివారులో ఏసీ పేలి తల్లి కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. చెన్నైలోని అంబత్తూరులో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో తల్లి, కూతురు మరణించారు.
ఏసీ పేలడంతో చెలరేగిన మంటలతో ఇద్దరు సజీవదహనమయ్యారు. చెన్నైలోని అంబత్తూర్‌లో హలీనా (50), కూతురు నస్రియా (16) ఇందిరా నగర్ సమీపంలోని మేనంపేడులోని ఓ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట ఇద్దరూ నివసిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎయిర్ కండిషనర్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. గది మొత్తం మంటలతో నిండిపోవడంతో తల్లీకూతుళ్లు ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. అర్థరాత్రి కావడం, చుట్టు పక్కల వాళ్లు కూడా గమనించకపోవడంతో ఇద్దరు మరణించారు.
మంటలు శరవేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కాసేపటి తర్వాత ఇంట్లో నుంచి భారీగా పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు ప్రజలు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అయితే అప్పటికే తల్లీకూతుళ్లు ఇద్దరు మరణించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ మేరకు ఏసీలో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, భారీగా వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.