IND Vs AUS : ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు టెస్టుల్లో ఘనవిజయం సాధించిన టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది. ఎట్టకేలకు సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని కూడా అనుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టీమిండియా జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాపార్డర్.. కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకి ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉండగా వారు దాన్ని సునాయాసంగానే ఛేదించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయంతో అందరూ రోహిత్ శర్మను నిందిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ చేసిన ఒకే ఒక్క తప్పు వలన ఇండియన్ టీంకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ఆలోచించేది పిచ్ గురించి, అనంతరం టాస్ గురించి. ఇక జట్టు కెప్టెన్ కు పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంటే బ్యాటింగ్ తీసుకోవాలో లేదా బౌలింగ్ తీసుకోవాలో అని ముందే నిర్ణయం తీసుకుంటారు. అయితే గత రెండు టెస్ట్‌లలో ఆసీస్ చేసిన తప్పును ఇప్పుడు రోహిత్ చేశాడు.
మొదటి రెండు టెస్ట్‌లలో ఆసీస్ ముందు బ్యాటింగ్ చేయడం వలనే ఓడిపోయిందని, వాటిని చూసిన తర్వాత కూడా రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఏంటని అభిమానులు, క్రికెట్ మాజీలు ప్రశ్నిస్తున్నారు. అదే రోహిత్ బౌలింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెబుతున్నారు. అయితే ఆసీస్ బౌలర్స్ చూపించిన ప్రతిభను మన బౌలర్స్ పెద్దగా చూపించ లేదు. అలాగే టాస్ గెలిచి బౌలింగ్‌కు బదులుగా ముందు బ్యాటింగ్ తీసుకోవడం, నిర్లక్ష్యపు షాట్స్ ఆడడం.. వంటివన్నీ టీమిండియా ఓటమికి కారణమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకున్నా.. మార్చి 9 నుంచి ప్రారంభం అయ్యే చివరి టెస్టులో మాత్రం భారత్ నెగ్గాల్సిందే. కనీసం డ్రా అయినా చేసుకోవాలి. లేదంటే అటు టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కి చేరుకునే అవకాశాలు సన్నగిల్లుతాయి. మరి 4వ టెస్టులో గెలుస్తారా.. లేదా.. అన్నది చూడాలి.