నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది శనివారం కన్నుమూసారు. ఈరోజు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారకరత్న మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు. తారకరత్న పార్థివ దేహాన్ని నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తారకరత్న మరణం తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తారకరత్న చివరిగా ‘మిస్టర్ తారక్’ టైటిల్ తో ఎ క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావించి ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే మిస్టర్ తారక్ విడుదలకు వారం రోజుల ముందు తారకరత్న కన్నుమూశారు. ఈ క్రమంలో మిస్టర్ తారక్ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు . మిస్టర్ తారక్ మూవీలో భార్య, ప్రాణమిత్రుడు చేతిలో మోసపోయిన వ్యక్తిగా తారకరత్న కనిపించనున్నారు. మిస్టర్ తారక్ ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాని మంచి హిట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాగా, తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు తెలుసుకున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. గత 23 రోజులుగా ఆయనకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాక మెదడుకు రక్త ప్రసరణ అందకపోవడం వలన మెదడులో పై భాగం దెబ్బతింది. న్యూరో స్పెషలిస్ట్స్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెదడు సాధారణ స్థితికి రాకపోవడంత కోమాలోనే కన్నుమూశారు. అయితే తారకరత్న ప్రాణాలు ఎప్పుడో పోయాయని, అయినా ఇంత కాలం ఆ అబ్బాయిని అలా వుంచడం ఏం రాజకీయమని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలకు అంతం లేదా? అని ఆమె ప్రశ్నించారు.