కరోనా సంక్షోభానికి ముందు విశేషంగా అలరించిన సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ప్రారంభమైంది. రాయ్ పూర్ లో తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా… 64 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ విజయం సాధించింది.. ఈ మ్యాచ్ లో హైలైట్ అంటే తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని విధ్వంసక ఇన్నింగ్సే అని చెప్పాలి. సునామి ఇన్నింగ్స్ ఆడి టీమ్‌కి మంచి విజయాన్ని అందించాడు. కేవలం 30 బంతుల్లో 91 పరుగులు చేశారు అఖిల్. దీంతో తెలుగు వారియర్స్ టీం ఘన విజయం అందుకుంది. అఖిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విక్టర్ వెంకటేష్ చేతుల మీదుగా అందుకున్నారు.
రాయ్‌పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా, అందుకు బదులుగా కేరళ స్ట్రయికర్స్ 5 వికెట్ల నష్టానికి 98 రన్స్ మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో అఖిల్ 19 బంతుల్లోనే 65 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని కేరళ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆ జట్టు 6 వికెట్లు నష్టపోయి 105 పరుగులు మాత్రమే చేసింది.
ఇంతటి భారీ విజయాన్ని ఇంతకు ముందు జట్టులో సభ్యుడిగా ఉన్న తారకరత్నకు అంకితం ఇస్తున్నట్లు అఖిల్ ట్వీట్ చేశాడు. తారకరత్న ఈ రోజు ఇక్కడ ఉండుంటే బాగుండేది . తారకరత్న గౌరవార్థం ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు రెండు నిమిషాలపాటు మౌనం పాటించాయి. అయితే అఖిల్ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. మీరు ఇండియన్ టీం లో ఉండి ఉంటే స్టార్ బ్యాట్స్ మెన్ గా దుమ్ముదులిపేవారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నెక్స్ట్ అఖిల్ ఏజెంట్ టైటిల్ తో యాక్షన్ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.