Sr NTR Hand Writing : కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా సీనియర్ ఎన్‌టీఆర్‌కు యాక్టింగ్‌లో మంచి పేరు ఉంది. ఆయనంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టం. ఆయన తెలుగు ప్రజలతోనే కాదు.. చిత్ర సీమలోని అందరితోనూ అన్నా అని పిలిపించుకున్నారు. ఆయనను ప్రతి తెలుగు కుటుంబం కూడా తమ ఇంటి పెద్దలా భావిస్తుంది. అప్పట్లో ఆయన పోస్టర్‌ను చూసే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు.. అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనకు బెంచ్ మార్క్ అంటూ ఉంటే.. అది ఎన్‌టీఆరే అని చెప్పాలి.
అయితే కేవలం నటన మాత్రమే కాదు.. సీనియర్ ఎన్‌టీఆర్ చేతి రాత కూడా అలాగే అందంగా ఉండేది. చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని నమ్మే ఆయన చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. తెలుగు భాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. చిత్రలేఖనంపై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. అప్పట్లో 1100 మంది రాసిన మద్రాస్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌లో ఆయన 7వ ర్యాంకు సాధించారు. అనంతరం మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు.
ఇక ఆయన చేతి రాత విషయానికి వస్తే అక్షరాలు ఆణిముత్యాలు అనే చెప్పవచ్చు. ఎక్కడ కూడా తప్పులు, అక్షర దోషాలు ఉండవు. చూస్తేనే చదవాలనిపించే చక్కని శైలిని కూడా ప్రదర్శించేవారు. ఒక సినిమా షూటింగ్ మధ్యలో దొరికిన గ్యాప్‌లో రాసిన లేఖ ఒకటి ఇటీవల విజయచిత్ర అనే పత్రికలో ముద్రించారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. అలనాటి అభిమాన నటుడి చేతి రాత కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన చేతి రాతను చూసి ఇంత అందంగా ఉందా.. అని ఆశ్చర్యపోతున్నారు.