Sana : బుల్లితెరతో పాటు వెండితెరపై నటించి ఎంతో మంది ప్రేక్షకులని సంపాదించుకుంది నటి సనా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించిన సన.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. ఇక సీరియల్స్‌లోనూ తన విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సన.. రీసెంట్‌గా ‘రంగమార్తాండ’ సినిమాలో నటించి మెప్పించింది. దర్శకుడు కృష్ణవంశీ ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సనా.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగమార్తాండ’లో నటించడం విశేషం అని చెప్పాలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన తన సినీ, వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకొచ్చింది.
సన పూర్తి పేరు షానూర్ సన బేగమ్. ఆమె పదో తరగతి వరకూ చదివింది. ఆ తరువాత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. సనకు చిన్నతనం నుంచీ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ గా ఉండడంతో, అది గుర్తించిన అత్తమామలు ఆమెలో ఉన్న ప్రతిభను ప్రోత్సాహించారు. అండగా నిలబడ్డారు.ఆ క్రమంలోనే మోడలింగ్ నుంచీ, టీవీ, యాంకరింగ్, తర్వాత సినిమాలు ఇలా అన్నీ వరుసగా జరిగిపోయాయి. సన తల్లి ముస్లిం, తండ్రి క్రిస్టియన్.. అయినా ముస్లిం సాంప్రదాయాల్లోనే ఎక్కువగా పెరిగింది సన.
ముందు తన అత్తయ్యకు చెప్తే ఒప్పుకోలేదని, తర్వాత మళ్లీ అడిగితే ఆలోచించుకొని ఓకే చేశారట. అలా ఇండస్ట్రీ వైపు తన అడుగులు పడ్డాయని చెప్పింది సన. మీ కోడలు బురఖా వేసుకోవట్లేదేంటి? బురఖా వేసుకోకుండా బయట తిరుగుతుందేంటి? అని అత్తమామలను అవమానించేవారని.. అయినా గానీ వారు వాటన్నిటినీ భరించి తనకు అండగా నిలబడ్డారని పేర్కొంది. అప్పటికే పెళ్ళై పిల్లలున్నారని చెప్పడం వలన తనకు హీరోయిన్ అవకాశాలు పోయాయని సనా వెల్లడించారు. ఇంకొన్ని సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయమని బలవంతం చేశారని.. స్విమ్ సూట్ వేసుకోమన్నారని.. కానీ కుదరదని చెప్పడంతో చాలా అవకాశాలు పోయాయని అన్నారు. తాను అన్ని దేవుళ్లని పూజాస్తానని, ముస్లిం అయిన కూడా తిరుపతికి కూడా వెళ్లానని సన పేర్కొంది.