Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బీఫాంలు అందించారు. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారందరికీ నామినేషన్ పత్రాలను అందించారు పవన్ కళ్యాణ్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ.. తెలంగాణలో మొత్తం 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. పలు స్థానాల్లో గెలుపుపై ధీమాగా ఉంది. వీటిలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి స్థానం ఒకటి. పైగా ఇక్కడ జనసేన తరఫున పోటీ చేస్తున్న ప్రేమ్ కుమార్ కొన్నేళ్లుగా నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ జనం మనసులు గెలుచుకుంటున్నారు.
2008లోనే తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దకాలం తర్వాత జనసేన ఇక్కడ పోటీ చేస్తోందన్నారు.1200 మందికి పైగా యువత, విద్యార్థుల ఆత్మగౌరవార్థం హోంరూల్ పాటించాలనే ఆలోచనతో దశాబ్దం పాటు పోటీకి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందన్నారు. ఏపీపై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. చేయకపోగా అప్పుడప్పుడు వీలయినప్పుడల్లా ప్రశంసలు కురిపించారే తప్ప ఆరోపణలకు కూడా దిగలేదు. ఫిలిం ఇండ్రస్ట్రీలో తాను భాగస్వామి కారణం కావచ్చు. కేసీఆర్ పాలన ఆయనకు నచ్చి ఉండవచ్చు. ఇవే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయంటే పవన్ వ్యవహారశైలి ఇందుకు కారణమని చెప్పకతప్పదు. జనసేన అభ్యర్థుల ప్రచారానికి హాజరైతే కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయాల్సి ఉంటుందనే దూరంగా ఉంటున్నారా? అన్న సందేహం కూడా సహజంగా తలెత్తుతుంది.