యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. 2014వ సంవత్సరంలో నిఖిల్ కెరీర్ లో హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవడంతో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆతృతతో ఎదురు చూశారు.. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలోనూ ఘనంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి తక్కువ థియేటర్స్ అయినప్పటికీ కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అమెరికా నుండి అనకాపల్లి వరకు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.
అలా మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా దాదాపుగా 16 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి అందరినీ ఆశ్చర్యపొయ్యేలా చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి కేవలం 13 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని ఈ సినిమా మూడు రోజుల లోపే వసూలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాకి రెండు వారల ముందుగా వచ్చిన కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం ఇలాగే మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ఈ చిత్రం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసిందనే అనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడంతో హైదరాబాద్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాతలందరూ హాజరై చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే ఈ సక్సెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము ఊహించలేదు. హిందీలో ఏదో సరదాకి విడుదల చేశాము. మొదటి రోజు కేవలం 30 నుండి 40 షోలు మాత్రమే పడింది. కానీ నేడు 1200 షోస్ కి పెరిగింది. ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా ముంబై లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది చూసి ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాలోని సన్నివేశాల గురించి వివరిస్తూ ఉంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆయన మాటలు వింటుంటే ఈ సినిమాని ఆయన ఎంత బాగా అర్థం చేసుకొని చూశారో తెలుస్తోంది. ఇక ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఈరోజు ఆయనే నా సినిమా చూసి నాకు శుభాకాంక్షలు తెలియచేయడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.. అంటూ నిఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.