Nara Lokesh : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన తారకరత్న గుండెపోటుతో స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుప్పం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తారకరత్నను నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదలయా ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే వచ్చారు. మరోవైపు వైద్యులు సైతం తారకరత్నని బ్రతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు.
విదేశాల నుంచి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా కూడా తారకరత్నని కాపాడుకోలేకపోయారు. ఆయన మృతి నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచింది. తారకరత్న మృతి తర్వాత నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్ర తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్.. వెంటనే బయలుదేరి రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయంతో నివాళులర్పించడంతో పాటు.. చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు.
తాజా ఇంటర్వ్యూలో నారా లోకేష్.. తారకరత్న మృతి గురించి స్పందించారు. మీరు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు తారకరత్న చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత చంద్రబాబుని అరెస్ట్ చేయడం, ఆ సమయంలో మీరు పాదయాత్రకి బ్రేక్ వేశారు. ఆ సమయంలో మీపై చాలా ట్రోలింగ్ నడిచింది. అప్పుడు మీరు ఏమి బాధపడలేదా అని ప్రశ్నించగా, అస్సలు బాధపడలేదు. చాలా స్ట్రాంగ్ అయ్యాను.2019లో నేను ఎవరికి పెద్దగా తెలియదు. కాని తర్వాత పాజిటివ్ ఆర్ నెగెటివ్ నేనంటే ఏంటో అందరికి తెలిసింది. కరోనా సమయంలో బరువు తగ్గాను. చాలా మారాను. కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎవరైన తమ జీవితంలో తప్పులు చేస్తారు. కాని నేర్చుకుని ముందుకు వెళ్లడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.