Krishnam Raju : నటనకు చెరగని చిరునామా రెబల్ స్టార్ కృష్ణం రాజు అని చెప్పవచ్చు. కృష్ణం రాజు సొంతపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అయ్యారు. కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఆయనకు పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. వీరిది ధనిక కుటుంబమే. ఆయనకు వారసత్వంగా వచ్చిన వంద ఎకరాల భూమి మొగల్తూరులో ఉంది. దాని నిర్వాహణ బంధువులే చూసుకుంటారట. మొగల్తూరులో ఒక భవనం కూడా ఉందట. ఇక చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం కృష్ణం రాజుకి నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటి ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోపికృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగాను కృష్ణం రాజు బాగానే సంపాదించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడిజ్ బెంజ్ కారు, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్ సి లాంటి కార్లను ఉపయోగిస్తారు. ఇంటికి అతిథులు ఎవరైన వస్తే వారికి కడుపు నిండా భోజనం పెట్టడం కృష్ణం రాజుకి అలవాటు. దీనిని ప్రభాస్ కూడా కొనసాగిస్తున్నారు. కానీ కృష్ణం రాజు అకాల మరణంతో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.