Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణించారు. అనేక చిత్రాలను నిర్మించారు. ఈయన 1983లో రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ బ్యానర్‌లో ఇద్దరు దొంగలు అనే సినిమాను తన తమ్ముడు కె.నాగేశ్వరరావుతో కలిసి నిర్మించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబులు ప్రధాన పాత్రలో నటించారు.
దో అంఖే బారాహత్ అనే హిందీ సినిమా నుండి ప్రేరణ పొంది పి.సత్యానంద్ ఈ సినిమా కథను రాశారు. 1984 జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక మొదటి సినిమాతోనే కైకాల నిర్మాతగా సక్సెస్ సాధించారు. అలాగే కైకాల సత్యనారాయణ చిరంజీవితో చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆ చనువుతోనే చిరంజీవి హీరోగా కొదమ సింహం అనే కౌబాయ్ సినిమాను నిర్మించారు.
మురళీ మోహన్ రావు కొదమ సింహం సినిమాకు దర్శకత్వం వహించారు. హిందీలో ప్రాణ్ పోషించిన అనేక పాత్రల్లో తెలుగులో సత్యనారాయణ నటించారు. నిప్పులాంటిమనిషి, యుగంధర్, నా పేరే భగవాన్ వంటి సినిమాలలో ప్రాణ్ పోషించిన పాత్రలలో తెలుగులో నటించి సత్యనారాయణ మెప్పించారు. అందువల్ల ప్రాణ్ అంటే సత్యనారాయణకు వల్లమాలిన అభిమానం. పలు సందర్భాల్లో ప్రాణ్ ను సత్యనారాయణ సన్మానించారు. ఇక బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ముద్దుల మొగుడు అనే చిత్రం నిర్మించారు. అంతేకాదు చిరంజీవితో కొదమ సింహం కంటే ముందు చిరంజీవి పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఇలా కైకాల సత్యనారాయణ చిరంజీవితో పలు సినిమాలను నిర్మించారు. అవి ఘన విజయం సాధించాయి.