Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌కి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు. కొన్నాళ్లుగా ఐపీఎల్ ఆడుతూ వస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఐపీఎల్‌కి కూడా గుడ్ బై చెప్పిన ఈ క్రికెటర్ ప్రస్తుతం రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్నాడు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు నిన్న ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాయుడు సీఎం జగన్ ను కలిశారు.
తాజా సమావేశంలో రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్కే పెద్దలు కూడా పాల్గొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న ఐపీఎల్ ట్రోఫీని వారు సీఎం జగన్ కు చూపించారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. ఈ క్రమంలో, చెన్నై ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని రూపా గురునాథ్, రాయుడు సీఎం జగన్ కు బహూకరించారు. అనంతరం క్రీడల అభివృద్ధికి తగిన సూచనలు స్వీకరిస్తామని, ఆ మేరకు పటిష్ఠమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి డైరెక్ట్‌గా తన ఇంటికి వెళ్లారు.. అయితే జగన్ తో భేటి తర్వాత అంబటి వైసీపీలో చేరడం ఖాయం అన్నట్టుగా ప్రచారం నడుస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను వెంటవెంటనే కలుస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. అయితే, అంబటి రాయుడు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుంది.