Mohan Babu : ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చాలా మందిని కలచివేసింది. ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అలాగే ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. గతకొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన చంద్రమోహన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతితో ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.
అయితే చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధాన్ని, చనువును ఈ వీడియోలో మోహన్ బాబు వివరించారు. ఆయనతో కలిసి తన సొంత సినిమాల్లో పాటు బయట చిత్రాల్లోనూ నటించానని మోహన్ బాబు చెప్పారు. 1966వ సంవత్సరంలో నేను కాలేజీల్లో చదువుతున్న రోజుల్లో చంద్రమోహన్ రంగులరాట్నం అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా నేను చూసి ముగ్ధుడిని అయిపోయాను. అప్పటి నుంచీ పరిచయం. ఆ తర్వాత నేను సినిమా రంగానికి రావడం.. అతను హీరోగా ఉన్న సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడం జరిగాయి. ఆ తర్వాత అతను నా బ్యానర్లో అల్లుడు గారు, రాయలసీమ రామన్న చౌదరి, విష్ణుతో ఢీ.. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలు మాతో చేశాడు.
అలాగే బయట సంస్థల్లో కూడా మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం. గొప్ప నటుడు, మంచి హృదయం ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి. నా ఆత్మీయుడు. వయసులో నాకంటే పెద్దవాడు అయినప్పటికీ ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునే చనువు కలిగిన వ్యక్తులం. అటువంటి ఆత్మీయుడు ఈరోజు మన మధ్య లేడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను న్యూజీలాండ్‌లో షూటింగ్లో ఉన్నాను. అందుకని ఈ మెసేజ్ ద్వారా నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని వీడియోలో మోహన్ బాబు వెల్లడించారు.మరోవైపు చంద్రమోహన్ మృతికి చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ తదితరులు ఎక్స్ ద్వారా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలియజేశారు.