Kantara : గత కొద్దిరోజులుగా బాక్సాఫీస్ వద్ద కాంతార సినిమా సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కేవలం 16 కోట్లు పెట్టి తీసిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రై మ్ లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని హోంభలే ఫిలిం బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటించి, ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉంటే.. ఇలాంటి కథతోనే మన తెలుగులో కూడా ఒక సినిమా వచ్చిందని మీకు తెలుసా..! ఆ చిత్రం ఏదంటే.. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో 2021 లో తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశారు కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రం కూడా ప్రపంచానికి దూరంగా అన్నట్లుగా ఒక గ్రామం ఉంటుంది.
కొండకోనల్లో నివసించే అక్కడి జనానికి దొర మాటే శాసనం. అయితే అక్కడ ఉండే ఒక చెట్టు తొర్రలో బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్ళని బతికించేది, శాసించేది దొరేనని బలంగా నమ్ముతారు. గూడెం సరిహద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలను తీస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఇక బయట నుంచి ఆ ఊరికి ఎవరు వచ్చినా దొర చంపేస్తాడు. అయితే ఆ ప్రజల జీవితాలను మార్చడానికి దేవుడు రేడియో రూపంలో వస్తాడు. అక్కడి నుంచి కథ ఆసక్తిగా ఉంటుంది. కానీ సినిమాలో నటులు ఎవరికి తెలియకపోవడంతో ఆ సినిమా ఆడలేదు.